You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
దిల్లీ: రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం, 21మంది మృతి
- రచయిత, పవన్ కాంత్ దిగవల్లి
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
దక్షిణ దిల్లీలోని మాలవీయ నగర్‌లోని ఫ్లరిష్ స్టేస్ బీ అండ్ బీ భవనంలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 21మంది మృతి చెందినట్టు దిల్లీ పోలీసులు నిర్థరించారు. అలాగే రెస్టారెంట్ భవనంలో చిక్కుకుపోయిన 40మందిని రక్షించారు.
ఉదయం 8 గంటల 8 నిమిషాలకు ఘటనపై తమకు సమాచారం అందిందని దిల్లీ పోలీసులు చెప్పారు.
ఇప్పటిదాకా నలుగురి మృతదేహాలను వెలికితీసినట్టు అధికారులు తెలిపారు. ‘‘21మంది చనిపోయారు. 47మందిని రక్షించారు’’ అని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే సతీశ్ ఉపాధ్యాయ చెప్పారు.
నాలుగు మృతదేహాలను వెలికితీసినట్టు దిల్లీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎస్‌డీఎం కూడా తెలిపారు.
మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడినవారికి 50వేల రూపాయలు పరిహారాన్ని ప్రకటిస్తున్నట్టు ప్రధాని కార్యాలయం ఎక్స్‌లో తెలిపింది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందాలు, అగ్నిమాపక శాఖ సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు, అలాగే సెంట్రలైజ్డ్ యాక్సిడెంట్ అండ్ ట్రామా సర్వీసెస్ అంబులెన్సులు ఘటనాస్థలికి చేరుకున్నాయి.
ఈ ఘటనలో ఇప్పటివరకు 21 మంది మృతి చెందినట్లు దిల్లీ పోలీసులు ధృవీకరించారు. అలాగే భవనంలో చిక్కుకుపోయిన 40 మందికిపైగా రక్షించినట్లు అధికారులు తెలిపారు.
అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఇంకా అధికారికంగా ఎలాంటి నిర్ధారణ చేయలేదు. అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సోమనాథ్ భారతి ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగి ఉండొచ్చని పేర్కొన్నారు. ఈ భవనం బేస్‌మెంట్, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మొత్తం ఐదు అంతస్తులు కలిగి ఉంది.
అగ్నిప్రమాదం నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి పై అంతస్తుల్లో ఉన్న పలువురు కిటికీల ద్వారా బయటకు దూకినట్లు సమాచారం. వారికి సహాయంగా స్థానికులు రోడ్డుపై పరుపులు, పరిచి రక్షణ చర్యల్లో భాగస్వాములయ్యారు. దీంతో భవనంలో ఉన్న కొందరు సురక్షితంగా బయటపడగలిగారు.
దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, బాధితులకు అవసరమైన అన్ని తక్షణ వైద్య సదుపాయాలను అందజేస్తామని పేర్కొన్నారు.
గాయపడిన పలువురిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
( ఈ కథనం అప్డేట్ అవుతోంది)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)